NaraLokesh padaytra,yuvagalam
NaraLokesh padaytra,yuvagalam

కొండపి నియోజకవర్గంలో ఉత్సాహంగా సాగిన యువగళం

అడుగడుగునా జన నీరాజనం… వినతుల వెల్లువ

నేడు కె.అగ్రహారం బహిరంగసభలో లోకేష్ ప్రసంగం

కొండపి: యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర కొండపి అసెంబ్లీ నియోజకవర్గంలో విజయవంతంగా ముందుకు సాగుతోంది. అడుగడుగునా ప్రజలు యువనేతకు హారతులిస్తూ నీరాజనాలు పట్టారు. 157వరోజు యువగళం పాదయాత్ర మాలెపాడు క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైంది. దారిపొడవునా వివిధ గ్రామాల ప్రజలు యువనేతతో ఫోటోలు దిగేందుకు పోటీపడ్డారు. కొండపి నియోజకవర్గ ప్రజలు యువనేతకు పెద్దఎత్తున సమస్యలు చెప్పుకున్నారు. మరికొద్దినెలల్లో రాబోయే చంద్రన్న ప్రభుత్వం అందరి సమస్యలకు పరిష్కారం చూపుతుందని భరోసా ఇస్తూ యువనేత ముందుకు సాగారు. మాలెపాడులో పాడిరైతులతో రచ్చబండ కార్యక్రమం నిర్వహించిన లోకేష్ వారి సమస్యలను తెలుసుకున్నారు. మాలెపాడు శివారు నుంచి ప్రారంభమైన పాదయాత్ర… చుండిమడుగు, తిమ్మపాలెం, అంకిరెడ్డిపాలెం, చెరుకువారిపాలెం, భోగనంపాడు, చెరువుకొమ్ముపాలెం మీదుగా చెరుకూరివారిపాలెం క్యాంప్ సైట్ కు చేరుకుంది. 157వరోజు యువనేత లోకేష్ 12.8 కి.మీ. పాదయాత్ర చేశారు. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 2082.9 కి.మీ. మేర పూర్తయింది. మంగళవారం యువనేత లోకేష్ కొండపి నియోజకవర్గం కె.అగ్రహారంలో జరిగే బహిరంగసభలో ప్రసంగించనున్నారు. అనంతరం పాలేటిగంగ వద్ద యువగళం పాదయాత్ర కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించనుంది.

సెల్ఫీచాలెంజ్ తో ప్రభుత్వాన్ని తూర్పారబట్టిన లోకేష్

కొండపి నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర సందర్భంగా సోమవారం సెల్ఫీ చాలెంజ్ లతో యువనేత లోకేష్ కాకపుట్టించారు. అధికారపార్టీ అరాచకాలను ఎండగడుతూ పలుచోట్ల సెల్ఫీ చాలెంజ్ లు విసిరారు.

రైతుబాంధవుడు చంద్రన్న

ఇవి గత టిడిపి ప్రభుత్వంలో అన్నదాతలకు ఇచ్చిన రైతురథాలు. యువగళం పాదయాత్ర సందర్భంగా మాలేపాడు శివార్లలో నాకు తారసపడ్డాయి. ఒక్క కొండపి నియోజకవర్గంలోనే 150 ట్రాక్టర్లు అందజేశాం. రైతును రాజుగా నిలపాలన్న లక్ష్యంతో చంద్రబాబు గారు పనిచేస్తే,. ఈరోజు తెల్లవారుజామున కుప్పం నియోజకవర్గం గుడిపల్లిలో వైసిపి సర్కారు వేధింపులు తాళలేక ఎండిఓ కార్యాలయంలోనే గోవిందప్ప అనే రైతన్న ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య  చేసుకున్నాడు. ఎవరు రైతు బాంధవుడు? ఎవరు రైతుల పాలిట యమకింకరుడు?!

నేను 25వేల కి.మీ.ల సిసి రోడ్లు వేశాను…

కొండపి నియోజకవర్గం తిమ్మపాలెంలో నేను పంచాయితీరాజ్ మంత్రిగా ఉన్నప్పుడు నిర్మించిన సిసి రోడ్డు తాలూకు వివరాలతో కూడిన బోర్డు ఇది. రాష్ట్రవ్యాప్తంగా గత టిడిపి ప్రభుత్వంలో 25వేల కి.మీ.ల సిసి రోడ్లు నిర్మించాం సర్కారు అధికారంలోకి వచ్చాక ఎఐఐబి ఇచ్చే నిధులను దారిమళ్లించి, కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్ లో పెట్టడంతో రాష్ట్రంలో రోడ్ల నిర్మాణానికి గుత్తేదారులు ముందుకురావడం లేదు

అధికారంలోకి వచ్చాక సహకార డైరీలను తెరిపిస్తాం! ఎపి పాడిపరిశ్రమను దేశంలోనే నెం.1గా తీర్చిదిద్దుతాం

ఒంగోలుజాతి పశు అభివృద్ధికి చర్యలు చేపడతాం పాత గ్రానైట్ పాలసీతో ఉపాథి అవకాశాలు కల్పిస్తాం

పాడిరైతులతో రచ్చబండ కార్యక్రమంలో నారా లోకేష్

కొండపి: టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మూతపడిన సహకార డైరీలన్నింటినీ తెరిపించి, పాడిరైతులకు లబ్ధి కలిగిస్తామని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. కొండపి నియోజడకవర్గం మాలెపాడులో పాడిరైతులతో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో లోకేష్ మాట్లాడుతూ… ఒంగోలు డైరీని అమూల్ కు అప్పగించేశారు, జగన్ కోఆపరేటివ్ డైరీల ఆస్తులన్నింటీ అమూల్ కి ధారాదత్తం చేస్తున్నాడు. వ్యవసాయం తో పాటు పాడి పరిశ్రమ ను కూడా పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందించాలి అనేది టిడిపి విధానం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పాడి రైతుల పెట్టుబడి తగ్గిస్తాం. పశువులు కొనడం దగ్గర నుండి పశుగ్రాసం, దాణా, మందులు సరఫరా వరకూ అన్ని సబ్సిడీలో అందిస్తాం. మినీ గోకులాలను ఏర్పాటుచేసి, పశుసంపదను పరిరక్షిస్తాం. ఆంధ్రప్రదేశ్ పాడి పరిశ్రమను దేశంలోనే నంబర్ 1 చేసే లక్ష్యంతో పనిచేస్తాం. గతంలోడ ఒంగోలు డైరీ మూతపడే పరిస్థితి వస్తే రూ.35 కోట్లు గ్రాంట్ ఇచ్చి డైరీ ని నడిపించాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మూసేసిన ఒంగోలు డైరీని తిరిగి ప్రారంభిస్తాం.

పాడిరైతులను మోసం చేసిన వైసీపీ

టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్ ధరలు తగ్గిస్తాం. పాడి రైతులకు అనేక హామీలు ఇచ్చి జగన్ మోసం చేసాడు. లీటర్ కి అదనంగా రూ.4 బోనస్ ఇస్తానని మోసం చేసాడు. పాడిరైతులకు పెట్టుబడి విపరీతంగా పెరిగిపోయింది. టిడిపి హయాంలో పశువులు కొనడం దగ్గర నుండి పశుగ్రాసం, దాణా, మందులు సబ్సిడీలో అందించాం. వైసీపీ అన్ని సబ్సిడీలు ఎత్తేసాడు. టిడిపి హయాంలో గోపాలమిత్ర లను పెట్టి పశువులకు వైద్యం ఉచితంగా అందించాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే గతంలో పాడి రైతులకు ఇచ్చిన అన్ని సబ్సిడీలు అందిస్తాం.

మేము ఎప్పుడూ రైతులపై వత్తిడి తేలేదు!

1992 లో హెరిటేజ్ డైరీ ని చంద్రబాబు ప్రారంభించారు. మేము విలువలతో హెరిటేజ్ కంపెనీ ని నడిపిస్తున్నాం. రైతులకు సమయానికి డబ్బులు ఇస్తుంది హెరిటేజ్ కంపెనీ. చంద్రబాబునాయుడు కోఆపరేటివ్ డైరీ లను ఆదుకున్నారు. ప్రైవేట్, ప్రభుత్వ డైరీలు ఉన్నప్పుడే పాడి రైతులకు మేలు జరుగుతుంది. మన రాష్ట్రంలో ఉన్న కోఆపరేటివ్ డైరీలను అభివృద్ది చెయ్యాలని నేను బలంగా నమ్ముతున్నాను. వేరే రాష్ట్రానికి చెందిన అమూల్ కంపెనీ కి జగన్ వేల కోట్ల ఆస్తులు కట్టబెడుతున్నాడు. మాకు ఫీడ్ కంపెనీ కూడా ఉంది కానీ టిడిపి అధికారంలో ఉన్నప్పుడు మా కంపెనీ ఫీడ్ కొనాలి, హెరిటేజ్ కే పాలు పొయ్యాలి అని ఎప్పుడూ వత్తిడి చెయ్యలేదు. విజయ, సంఘం, విశాఖ, విజయ లాంటి కోపరేటివ్ డైరీలను పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందించాలి అనేది టిడిపి ఆలోచన.

కోఆపరేటవ్ ఆస్తులు కట్టబెట్టడం సరికాదు!

గుజరాత్ కి చెందిన అమూల్ కంపెనీకి కోఆపరేటివ్ డైరీ ల ఆస్తులు అప్పన్నంగా కట్టబెట్టడం మంచిది కాదు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఒంగోలు జాతి ఆవులు, ఎద్దుల అభివృద్ది కోసం ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తాం. హెరిటేజ్ కంపెనీ లో పని చేసినప్పుడు పాడి రైతులకు ఉపయోగపడే అనేక కార్యక్రమాలు అమలు చేశాను. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే వాటర్ గ్రిడ్ పథకం ద్వారా ప్రతి ఇంటికి కుళాయి ద్వారా త్రాగునీరు అందిస్తాం . కరెంట్ ఛార్జీలు, రాయల్టీ విపరీతంగా పెంచేసి పరిశ్రమలు మూతపడేలా చేసాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పాత గ్రానైట్ పాలసీ అమలు చేస్తాం. పెంచిన పన్నులు తగ్గిస్తాం. మూసేసిన గ్రానైట్ పరిశ్రమలను తెరుస్తాం. 2019 గాలిలో కూడా ప్రకాశం జిల్లా ప్రజలు మా గౌరవాన్ని కాపాడారు. మిమ్మలని గుండెల్లో పెట్టుకుంటాం.  టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చి ప్రకాశం జిల్లా యువత కు ఇక్కడే ఉద్యోగాలు కల్పిస్తాం.

ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ…

టిడిపి హయాంలో పాడి రైతుల్ని ఆదుకున్నాం. 25 వేల కే లక్ష రూపాయలు విలువ చేసే గేదెలు సబ్సిడీలో అందించాం. సైలేజ్, మినరల్ మిశ్చర్ సబ్సిడీలో అందించాం. ఇప్పుడు జగన్ అన్ని కార్యక్రమాలు రద్దు చేసి పాడి రైతుల్ని దెబ్బతీశాడు.

పాడిరైతులు మాట్లాడుతూ…

టిడిపి హయాంలో సైలేజ్, మినరల్ మిశ్చర్ సబ్సిడీ లో అందించేవారు. వైసీపీ  పాలనలో పాడి రైతులకు ఇచ్చే అన్ని సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశాడు.  ఒంగోలు డైరీని అముల్ కి ఇచ్చేశారు. ఇప్పుడు అమూల్ కూడా ఆ డైరీ నీ మూసేసింది. టిడిపి హయాంలో పశువులు కొనడానికి సబ్సిడీ లో రుణాలు ఇచ్చేవారు. ఇప్పుడు జగన్ ఆ పథకాన్ని ఆపేసింది.తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. క్లోరైడ్ వలన అనేక ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం.

*వైసిపికి మద్దతు ఇవ్వలేదని షాపు కూల్చేశారు!*

*లోకేష్ ఎదుట ఓ బాధితుడు ఆవేదన*

*అధికారపార్టీ తొత్తులుగా పనిచేసే పోలీసులకు అరదండాలు తప్పవు*

పంచాయితీ ఎన్నికల్లో వైసిపికి మద్దతు ఇవ్వలేదని 20ఏళ్లుగా నడుపుకుంటున్న నా కిరాణా షాపును వైసిపి నాయకుల వత్తిడితో అధికారులు కూల్చేశారని కొండపి నియోజకవర్గం తిమ్మపాలెంకు చెందిన మోరబోయిన మాల్యాద్రి ఆవేదన వ్యక్తంచేశారు. యువగళం పాదయాత్ర సందర్భంగా మాల్యాద్రి సోమవారం లోకేష్ ను కలిసి తమ ఆవేదనను తెలియజేస్తూ… మా గ్రామంలోని గ్రామకంఠం సర్వే నంబర్ 769లో 20ఏళ్లుగా నేను కిరాణా దుకాణం నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాను. నేను బీసీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని. గత పంచాయితీ ఎన్నికల్లో నన్ను వైసిపివారు సపోర్ట్ చేయాలని అడిగితే, నేను నిరాకరించాను. దీంతో వైసిపి నాయకుల వత్తిడితో పోలీసులు, రెవెన్యూ అధికారులు జేసీబీని తెచ్చి నా షాపును సరుకుతో సహా కూల్చేశారు. షాపులోని సరుకులు వేరొకచోటుకు మార్చుకునేందుకు 2రోజుల సమయం ఇవ్వాలని అడిగినా కనికరించలేదు. దీంతో నేను రూ.4లక్షలు వరకు నష్టపోయాను.  ఆ తర్వాత బతుకుదెరువు కోసం కనిగిరి ప్రాంతానికి వలసవెళ్లానని ఆవేదన చెందాడు.

నారా లోకేష్ స్పందిస్తూ

ఇటువంటి అరాచకాలు చూసిన తర్వాతే బిసిల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తేవాలని నిర్ణయించాం. బిసిలపై వేధింపులకు పాల్పడిన ఎవరినీ వదలం. మాల్యాద్రి కుటుంబాన్ని వేధించిన వైసిపి నాయకులు, అధికారులను కఠినంగా శిక్షిస్తాం. ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేయకుండా వైసిపి నేతల వత్తిడితో అడ్డగోలుగా పనిచేసే పోలీసు అధికారులపై ప్రత్యేక విచారణ జరిపి, ఉద్యోగాల నుంచి తొలగించడమేగాక జైలుకు పంపుతాం. మాల్యాద్రి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుంది.

నారా లోకేష్ ను కలిసిన మూలెవారిపాలెం గ్రామస్తులు

కొండపి నియోజకవర్గం మూలెవారిపాలెం గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా గ్రామంలో అత్యధికులు టిడిపి సానుభూతిపరులన్న కక్షతో అభివృద్ధి కార్యక్రమాలు ఆపేశారు. మా గ్రామంలో రోడ్డు పనులు సగంలో నిలిపేశారు. ఇళ్ల స్థలాలు ఇచ్చిన సమయంలో మాకు స్థలాలు ఇవ్వలేదు. మా గ్రామంలో 60 కుటుంబాలున్నాయి, నీటి సదుపాయం లేదు. మా గ్రామం పక్కన వాగు ఉంది. దీనిపై చెక్ డ్యామ్ నిర్మించాలి. మీరు అధికారంలోకి వచ్చాక మా గ్రామ సమస్యలు పరిష్కరించాలి.

నారా లోకేష్ స్పందిస్తూ

సంక్షేమ పథకాల అమలులో కులం, మతం, ప్రాంతం చూడమని ముఖ్యమంత్రి కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మూలెవారిపాలెంలో పేదలందరికీ ఇళ్లు మంజూరు చేస్తాం. ప్రతి ఇంటికీ తాగునీటి కుళాయి అందజేసి, 24/7 నీరు సరఫరా అయ్యేలా చూస్తాం. గ్రామంలో రోడ్లు, డ్రైనేజీ, ఇతర అభివృద్ధి కార్యక్రమాలను పూర్తిచేస్తాం.

నారా లోకేష్ ను కలిసిన మాలేపాడు గ్రామస్తులు

కొండపి నియోజకవర్గం మాలేపాడు గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. కందుకూరు ఆసుపత్రి డయాలసిస్ కేంద్రంలో వసతులు లేవు. దీనివల్ల డయాలసిస్ పేషెంట్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కందుకూరు నుండి మాలేపాడుకు రవాణా సౌకర్యం లేదు, అంబులెన్సు సౌకర్యం కల్పించాలి. ఐరన్, ఎరిత్రోపాయిటిన్ ఇంజెక్షన్లు ప్రతివారం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. డయాలసిస్ పేషెంట్లకు ప్రభుత్వం ఇచ్చే రూ.10వేలు పెన్షన్ మందుల ఖర్చుకు సరిపోవడం లేదు. రూ.20వేలకు పెంచాలి. ఆసుపత్రిలో డయాలసిస్ పేషెంట్లకు విశ్రాంతి గదులు ఏర్పాటు చేయించాలి. కందుకూరు ఆసుపత్రిలో నెఫ్రాలజీ డాక్టర్ ను నియమించాలి.

నారా లోకేష్ స్పందిస్తూ

జగన్మోహన్ రెడ్డి పాలనలో వైద్య రంగం పూర్తిగా అస్వస్థతకు గురైంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు, మందులు, ఇంజక్షన్లు, దూది కూడా లేని దుస్థితి నెలకొంది. టిడిపి హయాంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల ద్వారా 23 రకాల మందులు అందించగా, ప్రస్తుతం కాల్షియం, ఐరన్ బిళ్లలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.1400 కోట్ల ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్ లో పెట్టడంతో ప్రైవేటు ఆసుపత్రుల్లో పేదవాడికి వైద్యం చేయడానికి నిరాకరిస్తున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే నెఫ్రాలజిస్ట్ ల నియామకం, విశ్రాంతిగదులు ఏర్పాటుచేస్తాం. కిడ్నీబాధితులకు అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటాం.

లోకేష్ ను కలిసిన కుంటిమల్లారెడ్డి సంక్షేమ సంఘం ప్రతినిధులు

కొండపి నియోజకవర్గం మాలెపాడు వాటర్ ట్యాంక్ వద్ద కుంటిమల్లారెడ్డి సంక్షేమ సంఘం ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలో 2 లక్షల మంది కుంటిమల్లారెడ్డి కులస్తులం ఉన్నాము. రెడ్డి కులం గోత్రాలు, ఆచార అలవాట్లను కథల రూపంలో తెలియజేయడం మా వృత్తి. మా కులంలో నిరక్షరాస్యత అత్యధికంగా ఉంది. మా కులానికి చెందిన చదువుకునే పిల్లలను మిగిలిన విద్యార్థులు పిచ్చిగుంట్ల అని ఎగతాళి చేస్తున్నారు. 1996లో మా కులానికి పిచ్చిగుంట్ల/వంశారాజ్ అనే పేరుతో జీఓ ఇచ్చారు. మేము కుంటి మల్లారెడ్డి వంశస్తులము. మా కులానికి పిచ్చిగుంట్ల అనే పదం తొలగించి కుంటిమల్లారెడ్డి అనే పేరు మార్చాల్సిందిగా కోరుతున్నాము.

నారా లోకేష్ స్పందిస్తూ

సమాజంలో అన్ని సామాజికవర్గాలు ఆత్మగౌరవంతో జీవించాలన్నదే తెలుగుదేశం పార్టీ లక్ష్యం. జగన్ అధికారంలోకి వచ్చాక నలుగురు తప్ప రెడ్డి సామాజికవర్గం కూడా తీవ్రంగా నష్టపోయింది. టిడిపి అధికారంలోకి వచ్చాక పిచ్చిగుంట్ల పేరును మార్పును చేస్తూ ప్రత్యేక జిఓ విడుదల చేస్తాం. కుంటిమల్లారెడ్డి కులస్తుల విద్యాపరంగా అభివృద్ధి చెందడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం. స్వయం ఉపాధి రుణాలను అందజేసి వారి ఆర్థికాభివృద్ధికి చేయూతనిస్తాం.

*నారా లోకేష్ ను కలిసిన పొన్నలూరు మండల పాస్టర్లు

కొండపి నియోజకవర్గం తిమ్మపాలెం వాటర్ ట్యాంక్ వద్ద పొన్నలూరు మండల పాస్టర్లు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా మండలంలోని పాస్టర్లకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి. ప్రార్థనా మందిరాలకు ప్రహరీల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి. మా సమస్యలపై వైసీపీ ప్రభుత్వానికి విన్నవించినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. పాస్టర్లకు రూ.10వేలు గౌరవ వేతనం ఇప్పించాలి. పాస్టర్లు, మందిరాల మీద దాడులను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలి. శిథిలావస్థకు చేరుకున్న మందిరాల స్థానంలో కొత్తవి నిర్మించేందుకు నిధులు ఇవ్వాలి. పాస్టర్లకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి. మీరు అధికారంలోకి వచ్చాక పాస్టర్ల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోండి.

*నారా లోకేష్ స్పందిస్తూ…*

రాష్ట్రంలో రాజకీయ లబ్ధికోసం ప్రభుత్వం కుల, మత విద్వేషాలను రెచ్చగొడుతోంది. క్రిస్టియన్ మైనారిటీలకు చెందిన వేల కోట్ల ఆస్తులను జగన్ అండ్ కో కబ్జా చేశారు. క్రైస్తవ శ్మశాన వాటికలను సైతం వైసిపి దొంగలు వదిలిపట్టడం లేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే క్రిస్టియన్ ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకుంటాం. ప్రార్థనామందిరాలు, శ్మశానవాటికలకు ప్రహరీగోడలు నిర్మిస్తాం. పాస్టర్లకు ఇళ్లస్థలాలు, ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తాం. ప్రార్థనామందిరాలపై దాడులు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటాం.

నారా లోకేష్ ను కలిసిన తిమ్మపాలెం గ్రామస్తులు

కొండపి నియోజకవర్గం తిమ్మపాలెం గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా గ్రామ సమీపంలోని అటవీ భూమిని తాతల కాలం నుండి సాగుచేసుకుంటున్నాం. మేమంతా సన్న, చిన్నకారు రైతులం. వైసీపీ ప్రభుత్వం అడవి పోరంబోకు భూముల్లోకి మమ్మల్ని వెళ్లకుండా అడ్డుకుంటోంది. దీంతో మేమంతా ఉపాధిని కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. మీరు అధికారంలోకి వచ్చాక మేం సాగుచేసుకుంటున్న భూములకు పట్టాలు ఇప్పించాలి. మేము సాగుచేసుకునే భూమిపై శాశ్వత హక్కులు కల్పించాలి.

నారా లోకేష్ స్పందిస్తూ

రైతులను ఏదోవిధంగా ఇబ్బంది పెట్టడం ప్రభుత్వానికి పరిపాటిగా మారింది. దీర్ఘకాలంగా రైతులు సాగుచేసుకుంటున్న భూముల్లోకి రైతులను వెళ్లనీయకపోవడం అన్యాయం. టిడిపి అధికారంలోకి వచ్చాక పోరంబోకు భూముల్లో రైతులు సాగుచేసుకునే అవకాశం కల్పిస్తాం. అటవీభూములకు పట్టాలిచ్చే అంశంపై కేంద్రంతో చర్చించి, నిర్ణయం తీసుకుంటాం.

నారా లోకేష్ ను కలిసిన అంకిరెడ్డిపాలెం గ్రామస్తులు

కొండపి నియోజకవర్గం అంకిరెడ్డిపాలెం గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా గ్రామంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. సిమెంట్ రోడ్లు నిర్మించాలి. వైసీపీ పాలనలో పక్కా ఇళ్లు మంజూరు చేయడంలేదు. గ్రామంలో మాకు దేవాలయం లేదు. రామాలయం నిర్మించాలి. సబ్సిడీ రుణాలు ఇచ్చి ఆర్థిక తోడ్పాటునందించాలి. అధికారంలోకి వచ్చాక మా గ్రామ సమస్యలను పరిష్కరించాలి.

నారా లోకేష్ స్పందిస్తూ

గ్రామపంచాయితీలకు చెందాల్సిన రూ.9వేల కోట్ల నిధులను ప్రభుత్వం దారిమళ్లించింది. టిడిపి అధికారంలోకి వచ్చాక గ్రామపంచాయితీలకు నిధులు కేటాయించి బలోపేతం చేస్తాం. గత టిడిపి ప్రభుత్వంలో గ్రామీణ ప్రాంతాల్లో 25వేల కి.మీ.ల సిసి రోడ్లు నిర్మించాం. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రోడ్లపై తట్టిమట్టి పోసే దిక్కులేదు.  మళ్లీ టిడిపి వచ్చిన వంటనే రోడ్లు, డ్రైనేజి వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. అంకిరెడ్డిపాలెంలో దేవాలయ నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం. ఇల్లు లేని ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు నిర్మించి ఇస్తాం. కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాలను పునరుద్ధరించి ఆర్థిక తోడ్పాటునందిస్తాం.

నారా లోకేష్ ను కలిసిన జడ్. మేడపాడు గ్రామస్తులు

కొండపి నియోజకవర్గం జడ్.మేడపాడు గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా గ్రామంలో సింగరామన్నచెరువు 70సంవత్సరాలుగా మనుగడలో ఉంది. వర్షాలు లేక ఈ చెరువు ఎండిపోవడంతో ఆయకట్టు రైతులు వ్యవసాయం మానేసి వలస వెళ్తున్నారు.  మా చెరువుకు ఫర్లాంగు దూరంలో మాకేరు వాగు వెళ్తోంది. వెలుగొండ ప్రాజెక్టు కుడికాల్వ నుండి సంగమేశ్వర ప్రాజెక్టుకు లింకు కలిపినట్లయితే పై భాగాన ఉన్న మా సమస్య తీరుతీంది. మాకేరు వాగుపై చెక్ డ్యామ్ నిర్మించి, లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మాకు సాగునీరు అందించాలి.

నారా లోకేష్ మాట్లాడుతూ

గత ప్రభుత్వంలో ఏర్పాటుచేసిన లిఫ్ట్ ఇరిగేషన్లకు కరెంటు బిల్లులు కట్టలేక పాడుబెట్టింది. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా చిన్ననీటి వనరులు, చెక్ డ్యామ్ ల నిర్మాణానికి  రూ.18,265 కోట్లు వెచ్చించాం. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సింగరామన్నచెరువుకు నీరందించే ఏర్పాటుచేస్తాం.

నారా లోకేష్ ను కలిసిన వేంపాడు గ్రామస్తులు

కొండపి నియోజకవర్గం వేంపాడు గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా గ్రామంలో సర్వే నెం.215లోని పాలేరు నదిలో ఇసుక అక్రమ తవ్వకాలను నిషేధిస్తూ మైనింగ్, స్థానిక అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు. వైసీపీ నేతలతో మైనింగ్ అధికారులు కుమ్మక్కయి మా గ్రామంలో అక్రమ తవ్వకాలకు అనుమతించారు. రానున్న కాలంలో వేంపాడు పరిసర ప్రాంతాల్లో పెద్దఎత్తున తవ్వకాలకు వైసీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇష్టారీతిన ఇసుక తవ్వకాల కారణంగా భూగర్భ జలాలు అడుగంటి బోర్లకు నీరు అందడం లేదు. తాగునీటి కోసం కిలోమీటర్ల దూరం వళ్లి నీళ్లు తెచ్చుకోవాల్సి వస్తోంది. పశువులకు కనీసం నీరు దొరికే పరిస్థితులు లేవు.  పాలేరు నదీపరివాహక ప్రాంతం ఎడారిని తలపిస్తోంది. మీరు అధికారంలోకి వచ్చాక మా గ్రామంలో ఇసుక, అక్రమ మైనింగ్ ను అడ్డుకోవాలి.

నారా లోకేష్ స్పందిస్తూ

రాష్ట్రంలో ఇదివరకెన్నడూ లేనివిధంగా ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు చేస్తూ వైసిపి నేతలు జేబులు నింపుకుంటున్నారు. ఎన్ జిటి ఉత్తర్వులను సైతం పక్కనబెట్టి యథేచ్చగా ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారు. రాష్ట్రంలో నదీతీర ప్రాంతాలప్రజలకు అందుబాటులో లేని ఇసుక పొరుగురాష్ట్రాల్లో మాత్రం పుష్కలంగా దొరుకుతోంది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఇసుక అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతాం. భూగర్భజలాల పరిరక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటాం.

నారా లోకేష్ ను కలిసిన జరుగుమల్లి మండల ప్రజలు

కొండపి నియోజకవర్గం చెరువుకొమ్ముపాలెంలో జరుగుమిల్లి మండల ప్రజలు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. కొండపి నియోజకవర్గం ప్రజలు తాగునీటి కోసం వర్షాలపై ఆధారపడాల్సివస్తోంది. కలుషిత నీటి వల్ల ఆర్థరైటీస్, ఇతర వ్యాధులకు గురవుతున్నారు. నియోజకవర్గంలోని 40గ్రామాలకు కృష్ణా జలాలు అందుతున్నాయి. మా మండలంతో పాటు మిగిలిన గ్రామాలకు కృష్ణా జలాలు అందించడానికి రూ.350కోట్లు అవసరం మీరు అధికారంలోకి వచ్చాక మా నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు నీరు అందించాలి.

నారా లోకేష్ స్పందిస్తూ

వైసిపి అధికారంలోకి వచ్చాగ రాష్ట్రంలో సాగు, తాగునీటి ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యంచేశారు. గత టిడిపి ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులపై రూ.68,294 కోట్లు ఖర్చుచేస్తే, వైసిపి ప్రభుత్వం నాలుగోవంతు కూడా ఖర్చుచేయలేదు. టిడిపి అధికారంలోకి వచ్చాక కృష్ణాజలాలను జరుగుమిల్లి మండలానికి అందించే ప్రాజెక్టును పూర్తిచేస్తాం. వాటర్ గ్రిడ్ ద్వారా ప్రతిఇంటికి 24/7 సురక్షితమైన తాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటాం.

Also Read This Blog :Marching Towards Progress: Yuvagalam Padayatra Reshapes Andhra Pradesh’s Political Landscape

Tagged:#LokeshPadaYatra#Padayatra#YuvaGalamLokesh#YuvaGalam#NaraLokeshPadaYatra#NaraLokesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *